: ‘కోట్లా’లో ఢిల్లీ కి షాక్... సునాయాసంగా నెగ్గిన కోల్ కతా నైట్ రైడర్స్!
సొంత స్టేడియం ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు కోల్ కతా నైట్ రైడర్స్ షాకిచ్చింది. ఐపీఎల్-8 లో భాగంగా నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో కోల్ కతా జట్టు, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతా, ఢిల్లీని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. చెలరేగిన కోల్ కతా బౌలర్లు ఢిల్లీ బ్యాట్స్ మన్ ను కట్టడి చేశారు. దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి, కేవలం 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత 147 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతా ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉండగానే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఆరంభంలో వెంటవెంటనే వికెట్లు పడ్డా, కెప్టెన్ గౌతం గంబీర్ (60), యూసుఫ్ పఠాన్ (40) చెలరేగడంతో కోల్ కతా సునాయాసంగానే విజయం సాధించింది.