: యెమెన్ లో దుకాణం ఎత్తేసిన భారత్... ఎంబసీ తరలింపు


యెమెన్ లో పరిస్థితులు నానాటికీ క్షీణిస్తున్నాయి. రాజధాని సనాతో పాటు పలు ప్రాంతాలు అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్నాయి. దీంతో, పలు దేశాలు తమ పౌరులను అక్కడి నుంచి తరలించాయి కూడా. భారత్ కూడా యెమెన్ నుంచి వేలాది మందిని స్వదేశానికి రప్పించింది. తాజాగా, యెమెన్ లోని భారత ఎంబసీని దిజ్బౌటీకి తరలించారు. ఈ వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఈ నెల 15న ఎంబసీని తరలించామని చెప్పారు. యెమెన్ రాజధాని సనాలో భద్రత మరీ దిగజారడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. యెమెన్ లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు దిజ్బౌటీ నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తామని వివరించారు. ఇక, యెమెన్ నుంచి భారతీయుల తరలింపు గురించి చెబుతూ... తాము 4,741 మంది భారతీయులతో పాటు, 48 దేశాలకు చెందిన 1,947 మంది విదేశీయులను కూడా సురక్షితంగా యెమెన్ నుంచి వెలుపలికి తీసుకువచ్చామని వెల్లడించారు. అత్యంత కఠిన పరిస్థితుల్లో తాము తరలింపు ప్రక్రియ చేపట్టామని అన్నారు. 'వసుధైక కుటుంబం' (ప్రపంచమంతా ఒక్కటే) స్ఫూర్తితో తాము తరలింపు ప్రక్రియ నిర్వహించామని తెలిపారు.

  • Loading...

More Telugu News