: నారా లోకేశ్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించండి... అయ్యన్నపాత్రుడి పుత్రుడి డిమాండ్!
టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలన్న వాదన బలపడుతోంది. ఇప్పటికే పార్టీ సభ్యత్వ నమోదును 50 లక్షలు దాటించి రికార్డు సృష్టించిన ఆయన, కార్యకర్తల సంక్షేమ యాత్రతో రెండు తెలుగు రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. లోకేశ్ పర్యటనకు రెండు రాష్ట్రాల్లోనూ భారీ స్పందన వస్తోంది. ఈ క్రమంలో ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి కొడుకు విజయపాత్రుడు నిన్న ఓ ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు. నారా లోకేశ్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని ఆయన సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. యువతతో కలిసి తామంతా లోకేశ్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల చంద్రబాబు చైనా పర్యటనలో భాగంగా అక్కడి ఓ కంపెనీతో విజయపాత్రుడు ఒప్పందం కుదుర్చుకుని వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే.