: పెళ్లికి ముందే డబ్బులు ఇవ్వండి: కలెక్టర్లతో కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో వివాహం చేసుకునే పేద యువతులకు పెళ్ళికి ముందే డబ్బులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబాకర్ పథకాల కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు వివాహం తరువాత కాకుండా, ముందే ధన సహాయం అందాలని, అప్పుడే ఈ పథకాలకు సార్థకత ఉంటుందని ఆయన అన్నారు. నేడు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ పథకాల్లో భాగం కావాలని భావించే వారు నేరుగా ఎంఆర్ఓకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దళితులకు కేవలం భూమి మాత్రం ఇచ్చి వదిలివేయకుండా, వ్యవసాయం చేసుకునేందుకు దారి కూడా చూపాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు వచ్చేలా పోటీ పరీక్షలు తయారు చేయాలని తెలిపారు. ఏవైనా ఘటనలు జరిగినప్పుడు ఎస్సీ, ఎస్టీ బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు కలెక్టర్ దగ్గర ఎప్పుడూ కోటి రూపాయల నిధి ఉంచుకోవాలని సూచించారు.