: లిఫ్ట్ ఇస్తామని, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను నిలువు దోపిడీ చేశారు
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను దొంగలు నిలువుదోపిడీ చేశారు. డబ్బు సంపాదించేందుకు వక్రమార్గాలు ఎంచుకుంటున్నారు. ఇలా వక్రమార్గం పడుతున్న వారిలో డ్రైవర్లు అగ్రస్థానంలో నిలుస్తున్నారు. అత్యాచారాలు, దోపిడీల్లో క్యాబ్ డ్రైవర్ల హస్తం ఉంటోంది. తాజాగా, పూణేలోని ఐటీ కంపెనీల అడ్డా, హింజేవది ఏరియాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు ప్రాణభయం కల్పించి, నిలువుదోపిడీకి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... క్యాబ్ మిస్ అవ్వడంతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రవిశంకర్ గోపాల్, మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఆఫీస్ దగ్గర్లో బస్టాండ్కు వెళ్లాడు. అక్కడ 'సార్ లిఫ్ట్ కావాలా?' అంటూ ఓ కారు డ్రైవర్ అడగడంతో సరేనని ఎక్కి కూర్చున్నాడు. కాసేపటికి ఆ డ్రైవర్ మరో ఇద్దరికి లిఫ్ట్ ఇచ్చాడు. అక్కడనుంచి కాస్త దూరం వెళ్లగానే వారు మారణాయుధాలు బయటికి తీసి, అతనిపై దాడికి దిగి, పర్సు గుంజుకున్నారు. పర్సులో ఏటీఎం కార్డు చూసి పిన్ చెప్పకపోతే పీకకోస్తామని బెదిరించారు. భయంతో వణికిపోయిన గోపాల్ వారికి నంబర్ చెప్పాడు. దీంతో అతని అకౌంట్ నుంచి లక్ష రూపాయలు డ్రా చేసుకున్నారు. రోజుకు లక్ష రూపాయలు మాత్రమే డ్రా చేసుకునే పరిమితి ఉండడంతో, మరుసటి రోజు తెల్లవారుజామున అతని అకౌంట్లో ఉన్న 50 వేలు కూడా డ్రాచేసి, పూణేకు కొద్దిదూరంలో విడిచిపెట్టి వెళ్లిపోయారు. అనంతరం బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు బాధితుడు గోపాల్ షాక్ కు గురయ్యాడని, దుండగులకు సంబంధించిన ఆనవాళ్లను చెప్పలేకపోతున్నాడని తెలిపారు. అయితే, ఏటీఎంలలో రికార్డయిన సీసీ టీవీ ఫుటేజిల ద్వారా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.