: ఖాతాలో డబ్బుల్లేవంటూ ఓయూ హాస్టల్ మెస్ లు మూసివేత... విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్ అండ్ సోషల్ సైన్స్ కళాశాలకు చెందిన హాస్టల్ మెస్ లను ఈరోజు నుంచి మూసివేస్తున్నట్టు ప్రకటించడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఓయూకు సంబంధించిన అన్ని హాస్టల్ మెస్ ల ఖాతాల్లో బ్యాలెన్స్ లేదని, తమకు రావల్సిన స్కాలర్ షిప్ లు కూడా సాంఘిక సంక్షేమ శాఖ నుంచి ఇంకా విడుదల చేయలేదని, అందుకే ఈ ఉదయం టిఫిన్ తరువాత ఏ, సీ హాస్టళ్లను మూసివేస్తున్నామని నోటీసు బోర్డులో పెట్టారు. దాంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కొత్త రాష్ట్రం వచ్చాక బాగుంటుందనుకుంటే ఇప్పుడు తమకు తిండి కూడా పెట్టకుండా కడుపులు మాడుస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దానిపై రిజిస్ట్రార్, ప్రిన్సిపాల్ లను కలసి తమ ఆందోళన తెలియజేస్తామని చెప్పారు.