: మందు కొట్టబట్టే బతికిపోయాను... శేషాచలం ఎన్ కౌంటర్ పై బాలచంద్రన్


మద్యం తాగే అలవాటున్న తనను ఆ అలవాటే ఇప్పుడు ప్రాణాలతో మిగిల్చిందని, లేకుంటే తను కూడా ఎన్ కౌంటర్ అయిపోయి ఉండే వాడినని అంటున్నాడు తమిళనాడుకు చెందిన బాలచంద్రన్. పోలీసులు తమవారిని అరెస్ట్ చేసి తీసుకుపోయి కాల్చి చంపారని ఆరోపిస్తున్నాడు. బాలచంద్రన్ స్టోరీని ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో హక్కుల కార్యకర్త హెన్రీ టిఫాగ్నే వివరించారు. ఈనెల 6వ తేదీన ఒక కాంట్రాక్టర్ పిలుపు మేరకు తన తండ్రి సహా, మరో 8 మందితో కలసి కూలీ పని నిమిత్తం బయలుదేరి, ఆర్కాట్ లో బస్సు కోసం వేచిచూస్తున్న సమయంలో మరో వ్యక్తితో కలసి మద్యం సేవించేందుకు బాలచంద్రన్ వెళ్లాడు. ఈ లోగా బస్సు రావడంతో మిగతా వారు దాన్ని ఎక్కి ఆంధ్రప్రదేశ్ కి బయలుదేరారు. బాలచంద్రన్ తో ఉన్న వ్యక్తికి కాంట్రాక్టరు తెలిసి ఉండడంతో వారు మరో బస్సు ఎక్కి పుత్తూరు చేరి, ఇతర కూలీలతో కలిసే నిమిత్తం కాంట్రాక్టరుకు ఫోన్ చేయగా, "రావద్దు, వెనక్కు వెళ్ళండి. లేకుంటే అరెస్ట్ అవుతారు" అని హెచ్చరించడంతో తిరిగి వెనక్కు వెళ్లిపోయారు. మిగిలిన వారంతా ఎన్ కౌంటర్ లో హతమైనట్టు మరుసటి రోజు తెలిసిందని బాలచంద్రన్ చెప్పినట్టు హెన్రీ తెలిపారు. అతని భద్రతను దృష్టిలో పెట్టుకొని మీడియాకు పరిచయం చేయడం లేదని వివరించారు. ఈ ఎన్ కౌంటర్ జరిపిన పోలీసులపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News