: పార్టీ కోసం చితికిపోయిన కార్యకర్తలను ఆదుకున్న తర్వాతే రాజకీయాల్లోకి వస్తా!: నారా లోకేశ్
తన రాజకీయ రంగ ప్రవేశంపై వెల్లువెత్తుతున్న ఊహాగానాలకు టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త, పార్టీ అధినేత, ఎపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేశ్ తెర దించారు. పార్టీ కోసం చితికిపోయిన కార్యకర్తలను పూర్తి స్థాయిలో ఆదుకున్న తర్వాతే రాజకీయాల్లోకి అగుడుపెడతానని ఆయన వ్యాఖ్యానించారు. కార్యకర్తల సంక్షేమ యాత్రలో భాగంగా కర్నూలు నగరంలోని చిత్తారి వీధిలో ఆయన ఓ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన నగర ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ‘‘నా రాజకీయ రంగ ప్రవేశంపై అందరూ మాట్లాడుతున్నారు. త్వరలో రాజకీయాల్లోకి రావాలని చాలా మంది అడుగుతున్నారు. అయితే దానికి ఇంకా సమయముంది. పార్టీని బతికించుకునే క్రమంలో చితికిపోయిన కార్యకర్తలను ఆదుకోవాల్సి ఉంది. పార్టీ కోసం ఆస్తులమ్ముకుని బక్కచిక్కిన కార్యకర్తలను ఆర్థికంగా స్వయం సమృద్ధం చేసిన తర్వాతే రాజకీయాల్లోకి వస్తా’’ అని ఆయన కుండబద్దలు కొట్టారు.