: శేషాచలం ఎన్ కౌంటర్ పోలీసులపై చంద్రగిరి పీఎస్ లో కేసు నమోదు
తెలుగు రాష్ట్రాలనే కాక యావత్తు దేశాన్నే కుదిపేసిన శేషాచలం ఎన్ కౌంటర్ లో పాలుపంచుకున్న 24 మంది పోలీసులపై ఎట్టకేలకు కేసు నమోదైంది. 20 మంది తమిళ కూలీలు మృత్యువాత పడ్డ ఈ ఘటనపై ఇటు ఏపీలోని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలతో పాటు తమిళనాడులో నిరసనలు మిన్నంటాయి. ఏపీ పోలీసుల పాశవిక చర్యపై మరణించిన కూలీల బంధువులు ఏకంగా జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. అదే క్రమంలో ఏపీ హైకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. ఇదిలా ఉంటే, నిన్న హైకోర్టు విచారణకు హాజరైన మృతుడు శశికుమార్ భార్య మునియమ్మాళ్, ఆ తర్వాత చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో పోలీసులపై ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు నేపథ్యంలో చంద్రగిరి పోలీసులు 24 మంది పోలీసులపై కేసులు నమోదు చేశారు. పోలీసులపై కేసులు నమోదవ్వడంతో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు ఉన్నతాధికారులు తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయంలో సమావేశమై చర్చించినట్లు సమాచారం.