: సీపీఎంలో ‘దళిత’ ప్రాతినిధ్యంపై నీళ్లు నమిలిన ప్రకాశ్ కరత్!
సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ప్రకాశ్ కరత్ సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్నారు. దళితోద్ధరణ, దళిత నేతల త్యాగాలపై ఆయన అనర్గళంగా మాట్లాడతారు. ఇవే అంశాలపై ఆయన ఏకంగా పాలక పార్టీలతో పాటు ప్రధాన ప్రతిపక్షాలనూ ఇరుకున పెట్టగలరు. ఇక ఆయన సతీమణి బృందా కరత్ రాజకీయ కదనరంగంలోకి అడుగు పెడితే, ప్రత్యర్థులు బెంబేలెత్తాల్సిందే. అలాంటి ట్రాక్ రికార్డు కలిగిన ప్రకాశ్ కరత్, మీ పార్టీలో ఎంతమంది దళితులకు పదవులిచ్చారని ప్రశ్నిస్తే, సమాధానం చెప్పలేక నిన్న ఢిల్లీలో నీళ్లు నమిలారు. అది కూడా స్వల్ప సంఖ్యలో సభ్యులుండే పోలిట్ బ్యూరోలో ఎంతమంది దళితులకు స్థానమిచ్చారో చెప్పండని అడిగినా ఆయన నుంచి సమాధానం రాలేదు. పార్టీ పోలిట్ బ్యూరోలో దళితులు లేరు కాని, జాతీయ కార్యవర్గంలో ఉన్నారంటూ సమాధానం దాటవేయబోయారు. కనీసం జాతీయ కార్యవర్గంలోనైనా ఎంతమంది దళితులున్నారో చెప్పమని అడిగితే, ఆ లెక్కలన్నీ పోలిట్ బ్యూరో దగ్గర ఉంటాయంటూ తుర్రుమన్నారు.