: ఇది ఆ కంపెనీ యజమాని ఘనత
ఉద్యోగులు సౌకర్యవంతంగా విధులు నిర్వర్తిస్తే, కంపెనీ పురోగతి రాకెట్ లా దూసుకుపోతుందని తెలుసుకున్న 'గ్రావిటీ పేమెంట్స్' అనే కంపెనీ యజమాని ఉద్యోగులకు సంతృప్తి కలిగే నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల కోసం ఆయన జీతంలో కోత పెట్టుకుని తన గొప్ప మనసు చాటుకున్నారు డాన్ ప్రైస్. క్రెడిట్ కార్డు ప్రాసెసింగ్ కు సంబంధించిన గ్రావిటీ పేమెంట్స్ అనే కంపెనీ యజమాని డాన్ ప్రైస్ ఏడాదికి 40 వేల డాలర్లు తీసుకుని పని చేస్తున్న ఉద్యోగుల ఇబ్బందులు తెలుసుకున్నారు. వారి సమస్యలు పరిష్కరిస్తే మరింత మంచి పనితనం రాబట్టవచ్చని భావించారు. అంతా తనలాగే సౌకర్యవంతంగా ఉండాలని భావించారు. దీంతో తక్షణం తన కంపెనీలో పనిచేసే ప్రతి ఉద్యోగికి ఏడాదికి 70 వేల డాలర్లు (43లక్షల రూపాయలు) వేతనం ఇస్తానని ప్రకటించారు. అలాగే తన వేతనం ఏడాదికి మిలియన్ డాలర్ల వేతనానికి కోత విధించుకున్నారు. తను కూడా 70 వేల డాలర్లు మాత్రమే తీసుకుంటానని చెప్పారు. మిగిలిన వేతనాన్ని కంపెనీ ఉద్యోగుల వేతనం కోసం వెచ్చిస్తానని అన్నారు. కాగా, ఈ కంపెనీలో 120 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వేతనాలు ఒక్కసారిగా పెంచడంతో కిందిస్థాయి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంస్థ ఉద్యోగులంతా యజమాని గొప్పతనాన్ని కొనియాడుతున్నారు.