: జనతా పరివార్ విలీనం బీహార్ ఎన్నికలపై ప్రభావం చూపదు: బీజేపీ
ఆరు పార్టీలతో తిరిగి ఏకమైన జనతా పరివార్ విలీనంపై బీజేపీ స్పందించింది. వచ్చే ఏడాది బీహార్ శాసనసభ ఎన్నికల్లో పరివార్ పోటీ చేస్తుందన్న వార్తల నేపథ్యంలో, ఈ ఎన్నికలపై జనతా పరివార్ విలీనం ప్రభావం చూపదని ధీమా వ్యక్తం చేసింది. బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ మాట్లాడుతూ, "విలీన ప్రయోగాలు గతంలో వికటించాయి. ఈ సారి కూడా అదే జరుగుతుంది. మూడు, నాలుగు కత్తులు ఒక ఒరలో ఎలా దూరతాయి? ఇదీ అంతే" అని వ్యాఖ్యానించారు. విలీనంలో ఉన్న ఆర్జేడీ, జేడీ(యు), సమాజ్ వాదీ పార్టీ ప్రధాన నేతలందరికీ ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉందని, వారి పార్టీలకు వేరే ఎవరైనా నాయకత్వం వహిస్తే అస్సలు సహించరని సుశీల్ వ్యాఖ్యానించారు. 1977లో నాలుగు పార్టీలు కలిసి ఏకమైన సంఘటనను గుర్తు చేసుకున్న ఈ బీజేపీ నేత, సంవత్సరంలోనే వారంతా విలీనం నుంచి విరమించుకున్నారని, మళ్లీ 1989లో కలసినా దీర్ఘకాలం నిలవలేదని అవహేళన చేశారు.