: అసలు చెరిల్ పుట్టినరోజు ఎప్పుడు? ఇంటర్నెట్ లో సునామీలా తిరుగుతున్న సవాల్!
సింగపూర్ కు చెందిన న్యూస్ ప్రెజెంటర్ ఒకరు తన ఫేస్ బుక్ టైం లైన్ పై ఒక ప్రశ్న సంధించాడు. ఇప్పుడా ప్రశ్న సామాజిక మాధ్యమాల్లో సునామీలా తిరుగుతోంది. లాజికల్ రీజనింగ్ ఆధారంగా ఈ ప్రశ్న ఉండగా, ఒక్క రోజులో 5 వేల షేర్లు వచ్చాయి. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే... చెరిల్ పుట్టినరోజు ఎప్పుడు?... అసలు చెరిల్ ఎవరు? అని ఆలోచిస్తున్నారా? సింగపూర్ అండ్ ఆసియన్ స్కూల్స్ మ్యాథ్ ఒలింపియాడ్ ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ఒక ప్రశ్న ఇది. వాస్తవానికి ఫిఫ్త్ గ్రేడ్ చదువుతున్న వారికోసం తయారైన పరీక్ష ఇది. ఈ ప్రశ్నకు సమాధానం కోసం నెట్ ప్రియులు కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నారు. ప్రశ్న ఏంటంటే... ఆల్బర్ట్, బెర్నార్డ్ లు ఈమధ్యనే చెరిల్ తో ఫ్రెండ్స్ అయ్యారు. ఆమె పుట్టిన రోజు ఎప్పుడో తెలుసుకోవాలని అనుకున్నారు. ఆమె 10 రోజులను చెప్పింది. మే 15, మే 16, మే 19, జూన్ 17, జూన్ 18, జూలై 14, జూలై 16, ఆగష్టు 14, ఆగష్టు 15, ఆగష్టు 17 తేదీలలో ఒక రోజు తన పుట్టిన రోజని తెలిపింది. వారిద్దరికీ విడివిడిగా ఆల్బర్ట్ కు నెలను, బెర్నార్డ్ కు తేదీని చెప్పింది. ఆల్బర్ట్: నాకు చెరిల్ పుట్టిన రోజు ఎప్పుడో తెలియదు. బెర్నార్డ్ కు కూడా తెలియదని మాత్రం నాకు తెలుసు. బెర్నార్డ్: చెరిల్ పుట్టిన రోజు ఎప్పుడో తొలుత తెలియలేదు. కానీ ఇప్పుడు తెలుసు. ఆల్బర్ట్: అయితే నాకు కూడా చెరిల్ పుట్టిన రోజు ఎప్పుడో తెలుసు. ఇక ఇప్పుడు చెప్పండి... చెరిల్ పుట్టినరోజు ఎప్పుడు? ఈ ప్రశ్నే బుర్రలు తొలిచేస్తోంది. రకరకాల ఆలోచనలతో చంపేస్తోంది. గంటల కొద్దీ సమయాన్ని తినేస్తోంది. జవాబు కోసం మీరూ ఆలోచించండి!