: సానియా విజయం పాకిస్థాన్ కు కూడా గర్వకారణం: షోయబ్ మాలిక్
టెన్నిస్ లో ప్రపంచ నెంబర్ 1గా నిలిచిన తన భార్య, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా విజయంపై ఆమె భర్త, పాకిస్థాన్ మాజీ క్రికెట్ కెప్టెన్ షోయబ్ మాలిక్ స్పందించాడు. తన భార్య సాధించిన విజయాన్ని గర్వంగా భావిస్తున్నట్టు తెలిపాడు. అంతేగాక భారత్, పాకిస్థాన్ దేశాలకు అత్యంత గౌరవప్రదమని పేర్కొన్నాడు. "ఈ విజయం పట్ల నేను చాలా గర్వంగా, సంతోషంగా ఉన్నా. నా భార్యగా పాకిస్థాన్ కు చాలా గర్వకారణం. అంతేకాదు 100 శాతం నిబద్ధతతో తన దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తోంది" అని షోయబ్ పేర్కొన్నాడు. సానియా విజయం యువ అభిమానులకు ప్రేరణ ఇస్తుందని నిరూపించుకుందన్నాడు. తన భార్య గెలుపొందిన తరువాత సియోల్ కోటలో కుటుంబ సభ్యులతో వేడుక జరుపుకున్నానని వెల్లడించాడు. సానియాను వివాహం చేసుకోకముందు టెన్నిస్ అంటే చాలా ఇష్టమని, కానీ ఇప్పుడు తన హృదయమంతా నిజంగా అదే నిండి ఉందని చెప్పుకొచ్చాడు. భార్య ఆడుతున్న సమయంలో ఆమె వెంట తానెప్పుడు ఉండను కాబట్టి, తన మ్యాచ్ లు ఎప్పుడూ చూస్తుంటానని షోయబ్ చెప్పాడు.