: పోలీస్ స్టేషన్ లో చోరీ... ఏడు వాకీ టాకీలు ఎత్తుకెళ్లిన దొంగలు!
నిజమేనండోయ్, దొంగతనాలపై ఫిర్యాదులు నమోదు చేసుకునే పోలీస్ స్టేషన్ లోనే చోరీ జరిగింది. అయితే విలువైన పరికరాలేమీ చోరీకి గురి కాలేదు కాని, ట్రాఫిక్ పోలీసులు వినియోగించే ఏడు వాకీటాకీలను మాత్రం చోరులు ఎత్తుకెళ్లారట. మిగిలిన వాటిని మాత్రం ముట్టుకోలేదట. తమిళనాడు రాజధాని చెన్నైలోని మౌంట్ రోడ్డు సమీపంలోని తేనాంపేట పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే చోరులు చొరబడటం గమనార్హం. తెల్లవారుజామున స్టేషన్ కు వచ్చిన పోలీసులు ట్రాఫిక్ స్టేషన్ తాళం పగులగొట్టి ఉండటాన్ని చూసి లోపలికి వెళ్లి చూడగా, చోరీ బయటపడింది. దీనిపై ట్రాఫిక్ పోలీసులు క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు వాకీటాకీలతో దొంగలకేం పనో పోలీసులకు మాత్రం ఎంత ఆలోచించినా తెలియడం లేదట!