: ఆదుకున్న పొలార్డ్, ఆండర్సన్... గౌరవప్రదమైన స్కోరు చేసిన ముంబై ఇండియన్స్!
ఆదిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోవడం, హిట్టర్ గా పేరుగాంచిన ఆరోన్ ఫించ్ (10) రిటైర్డ్ హర్ట్ తో కష్టాల్లో పడ్డ ముంబై ఇండియన్స్ ను ఆ జట్టు బ్యాట్స్ మెన్ కీరన్ పొలార్డ్, కోరీ ఆండర్సన్ లు ఆదుకున్నారు. దీంతో అహ్మదాబాదులోని మోతేరా స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో ఆ జట్టు 164 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. జట్టు బ్యాటింగ్ కు వెన్నెముకగా నిలుస్తాడనుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ (0) డకౌట్ కావడంతో పాటు స్వల్ప స్కోరుకే పార్థీవ్ పటేల్ (16) కూడా వెనుదిరగడంతో ముంబై పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. అయితే కష్ట సమయాల్లో ఆపద్బాంధవుడిలా అవతరించే కీరన్ పొలార్డ్ (70) బ్యాటుతో చెలరేగాడు. కేవలం 30 బంతుల్లోనే అతడు ఏడు ఫోర్లు, ఐదు సిక్స్ లతో చెలరేగాడు. ఇక అతడి కంటే కాస్త ముందుగా క్రీజులోకి వచ్చిన న్యూజిల్యాండ్ యువ సంచలనం కోరీ ఆండర్సన్ (50) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఇక 165 పరుగుల విజయలక్ష్యంతో రాజస్థాన్ రాయల్స్ మరికాసేపట్లో బ్యాటింగ్ ప్రారంభించనుంది.