: వైసీపీ నేతల ఇలాకాల్లో లోకేశ్ యాత్రకు బ్రహ్మరథం... వర్షంలో తడుస్తూనే పాల్గొన్న కార్యకర్తలు
టీడీపీ కార్యకర్తల నిధి సమన్వయకర్త నారా లోకేశ్ చేపట్టిన కార్యకర్తల సంక్షేమ యాత్రకు చిత్తూరు జిల్లాలో అనూహ్య స్పందన వచ్చింది. ప్రధానంగా ప్రతిపక్ష వైసీపీ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న మూడు నియోజకవర్గాల్లో లోకేశ్ యాత్రకు వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చారు. నేటి ఉదయం తన తండ్రి నియోజకవర్గం కుప్పంలో లోకేశ్ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర, పలమనేరు, పూతలపట్టు మీదుగా పుంగనూరు దాకా సాగింది, ఒక్క కుప్పం మినహాయిస్తే, మిగిలిన మూడు నియోజకవర్గాలు కూడా వైసీపీ నియోజకవర్గాలే కావడం గమనార్హం. పూతలపట్టు నియోజకవర్గ పరిధిలోని బంగారుపాళెంకు నిర్ణీత సమయం కంటే కాస్త ఆలస్యంగా యాత్ర చేరుకుంది. ఈ క్రమంలో వర్షం జోరందుకుంది. అయినా వెనుదిరగని పార్టీ కార్యకర్తలు, బంగారుపాళెం ప్రజలు లోకేశ్ కోసం వర్షంలోనే తడుస్తూ వేచి చూశారు. లోకేశ్ అక్కడికి చేరుకున్న తర్వాత కూడా వర్షం తగ్గలేదు. అయినా లోకేశ్ తన యాత్రను కొనసాగించగా... కార్యకర్తలు, ప్రజలు ఉత్సాహంగా యాత్రలో పాల్గొన్నారు.