: దేశాధినేతలకు మలాలా లేఖాస్త్రం... 219 మంది అమ్మాయిలను ఎత్తుకెళ్తే, ఏం చేశారని నిలదీత!
పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఎదురొడ్డి నిలిచి నోబెల్ శాంతి బహుమతి చేజిక్కించుకున్న సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్, తాజాగా బోకోహరామ్ ఉగ్రవాదుల అకృత్యాలపై గళం విప్పింది. ఏడాది క్రితం సదరు ఉగ్రవాద సంస్థ 219 మంది అమ్మాయిలను ఎత్తుకెళితే, ఏం చేశారని ప్రపంచ దేశాధినేతలను ఆమె నిలదీసింది. ఈ మేరకు నేడు లండన్ నుంచి ప్రపంచ దేశాధినేతలకు ఆమె లేఖాస్త్రం సంధించింది. ప్రధానంగా నైజీరియా దేశాధినేతల అలసత్వాన్ని ఆ లేఖలో ప్రశ్నించిన ఆమె, ప్రపంచ దేశాలు కూడా ఈ దారుణాన్ని చూసీ చూడనట్లు వ్యవహరించడంపై ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘బోకోహరామ్ ఉగ్రవాదులు 219 అమ్మాయిలను ఎత్తుకెళ్లి నేటికి ఏడాది పూర్తవుతోంది. అయినా వారి విడుదల కోసం మీరేం చేశారో చెప్పాలి’’ అని ఆమె తన లేఖలో ప్రపంచ దేశాధినేతలను నిలదీసింది. ఒక్క పాకిస్థాన్ లోనే కాక మహిళలు, బాలికలపై ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ దాడులు, అకృత్యాలు జరిగినా సహించేది లేదని ఆమె స్పష్టం చేసింది.