: షరతులు లేని రుణ మాఫీ ఎక్కడ?: లోకేశ్ కు కుప్పం కార్యకర్తల ప్రశ్న!
రాయలసీమలో కార్యకర్తల సంక్షేమ యాత్ర ప్రారంభించిన టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ కు ఆయన తండ్రి సొంత నియోజకవర్గం కుప్పంలోనే షాక్ తగిలింది. షరతులు లేని రుణ మాఫీ ఎక్కడంటూ కార్యకర్తలు నిలదీయడంతో ఆయన కాస్త ఇబ్బందిని ఎదుర్కొన్నారు. పార్టీ కార్యకర్తల సంక్షేమ యాత్ర చేపట్టిన లోకేశ్ నేడు కుప్పం వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి కార్యకర్తలు రుణమాఫీపై ప్రశ్నలు సంధించారు. ‘‘ఎన్నికలకు ముందు షరతులు లేని రుణమాఫీ అన్నారు. దీంతో మాతో పాటు ఇతర పార్టీ వాళ్లతోనూ పార్టీకి ఓట్లేయించాం. మరి ఎన్నికలు ముగిసి అధికారం చేపట్టిన తర్వాత రుణమాఫీని షరతులతోనే అమలు చేస్తున్నారు. దీంతో కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదు. పాత రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు కూడా నోటీసులు పంపుతున్నారు. కొత్త రుణాలు ఇవ్వడం లేదు’’ అని లోకేశ్ ను కార్యకర్తలు ప్రశ్నించారు. కార్యకర్తల ప్రశ్నలతో కాస్త ఇబ్బందిపడ్డ లోకేశ్, బ్యాంకర్లతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి యాత్రను కొనసాగించారు.