: మా ఆడబిడ్డలను వెనక్కు తెండి: విలపిస్తున్న నైజీరియా తల్లిదండ్రులు
తమ కన్న బిడ్డలను వెనక్కు తీసుకురావాలని ఆ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. నైజీరియాలోని బోకో హరామ్ తీవ్రవాదులు చిబుక్ ప్రాంతానికి చెందిన 219 మంది అమ్మాయిలను కిడ్నాప్ చేసి సరిగ్గా సంవత్సరం అయిన నేపథ్యంలో వారి తల్లిదండ్రులు నిరసనలు చేపట్టారు. రాజధాని నగరం అబూజా వీధుల్లో విలపిస్తూ నినాదాలు చేశారు. వీరి కిడ్నాప్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, అమ్మాయిలను వెనక్కు తెచ్చేందుకు సహకరిస్తామని అమెరికా వాగ్దానం చేసినప్పటికీ, వారి జాడను కనిపెట్టడంలో మాత్రం విఫలం అయింది. కాగా, బోకో హరామ్ తీవ్రవాదులు మాత్రం వీరిని ముస్లిం మతంలోకి మార్చి వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది. సుమారు 20 మంది వరకూ అమ్మాయిలు వారి నుంచి తప్పించుకొని రాగా, మిగిలిన వారిలో మతం మారేందుకు ఇష్టపడని వారిని చంపేశారని, మరికొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని సమాచారం. కిడ్నాప్ నకు గురైన వారిలో కేవలం 50 మంది మాత్రమే బతికున్నారన్నది ఐరాస వర్గాల సమాచారం.