: ఎప్పుడు పడితే అప్పుడు పన్ను విధానం మార్చబోము: జర్మన్ ఇన్వెస్టర్లకు మోదీ హామీ


ఇండియాలో కార్పొరేట్ పన్నులను తగ్గిస్తామని, భవిష్యత్తులో పెరగకుండా చట్ట భద్రత కల్పిస్తామని, వస్తు రవాణా, సేవా పన్నులు దేశవ్యాప్తంగా ఒకేలా ఉండేలా చూస్తామని ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీ ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చారు. ఒక స్థిరమైన, పారదర్శకమైన పన్ను విధానం అమలు అయ్యేలా చూస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు జర్మన్ కేంద్రంగా వెలువడుతున్న దినపత్రికకు ఆర్టికల్ రాశారు. అభివృద్ధి రాజకీయ ఎజెండా కాదని, నమ్మకంతో ముందుకు సాగవలసి ఉందని అన్నారు. భారత వృద్ధి బాటలో అంతర్జాతీయ సహకారం ఎంతో అవసరమని ఆయన వివరించారు. ఇండియా మరోసారి వేగవంతమైన డెవలప్ మెంట్ దిశగా పరుగులు పెట్టనుందని, ఆ అవకాశాలు అందిపుచ్చుకోవాలని కోరారు. ఉత్పత్తి రంగంలో మరింత ముందుకు వెళ్తేనే ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందుతుందని అభిప్రాయపడ్డ మోదీ, అందుకు అంతర్జాతీయ సమాఖ్య సహకారం అవసరమని అన్నారు. భారత్ లో 65 శాతం మంది జనాభా 35 సంవత్సరాలలోపువారే అని గుర్తుచేసిన ఆయన ఇండియా వృద్ది చెందుతుందనడానికి అదే నిదర్శనమని పేర్కొన్నారు. ఇండియా ముందడుగుతోనే ప్రపంచ పయనం ఆధారపడి ఉందని అంచనా వేసిన ఆయన, ఇండియాలోని ప్రజాస్వామ్యం, స్వేచ్ఛా వాతావరణం, న్యాయ వ్యవస్థ అండగా ఉంటాయని చెప్పారు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్, చైనా తదితర దేశాలతో భాగస్వామ్యాలు నెలకొల్పి ప్రపంచ అభివృద్ధిలో భాగం కావడమే తన ప్రధాన లక్ష్యమని మోదీ తెలిపారు.

  • Loading...

More Telugu News