: చైనా ప్రతినిధులకు సమర్థవంతంగా సమాధానాలు చెప్పిన బాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సమర్థతను మరోసారి నిరూపించుకున్నారు. పెట్టుబడుల సేకరణకు చైనా వెళ్లిన ఆయన తొలిసారి సినోమా సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో సంస్థ ప్రతినిధులు వరుస ప్రశ్నలతో ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశారు. అలాంటివెన్నో చూసిన సీఎం చంద్రబాబు ఏమాత్రం తొట్రుపాటుకు లోనవ్వకుండా, ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. 70 దేశాల్లో సినోమా సంస్థ పెట్టుబడులు పెట్టిందని తనకు తెలుసని, భారత్ లో రెండు సిమెంటు పరిశ్రమలకు సామాగ్రిని సరఫరా చేస్తోందని కూడా తెలుసని ఆయన ప్రతినిధులకు చెప్పారు. పవన, సౌర విద్యుత్ రంగంలో పెట్టుబడులు సురక్షితమని చెప్పిన ఆయన, రాజధాని నిర్మాణంలో భారీ ఎత్తున సిమెంటు అవసరం పడుతుందని, ఆ దిశగా సినోమా కంపెనీ పెడితే సంతోషిస్తామని అన్నారు. కేవలం 21 రోజుల్లో అన్ని రకాల అనుమతులు మంజూరు చేస్తామని ఆయన చెప్పారు. ఏపీలో పెట్టుబడులకు అపారమైన సహజవనరులున్నాయని వారికి తెలిపారు. నిరంతర విద్యుత్ సరఫరా ఏపీలో ఉందని ఆయన చెప్పారు. దీంతో సిమెంటు పరిశ్రమ పెట్టేందుకు వారు ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది.