: షాకిస్తున్న కరెంట్ వైర్లు... తెలుగు రాష్ట్రాల్లో నలుగురి మృతి
అకాల వర్షాలు, ఈదురు గాలులతో విద్యుత్ తీగలు తెగిపడడంతో తెలుగు రాష్ట్రాల్లో నలుగురు ప్రాణాలను కోల్పోయారు. వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామంలో బీటెక్ విద్యార్థి గౌరినాథ్ (22) పొలానికి వెళ్లి ప్రమాదవశాత్తూ, తెగిపడ్డ కరెంట్ తీగలను తాకి షాక్ తో మృతి చెందాడు. ఆగ్రహించిన గ్రామస్తులు మృతదేహంతో సబ్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగేందుకు ప్రయత్నించగా, విషయం తెలుసుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు తప్పకుండా చూశారు. మరో ఘటనలో కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ గ్రామంలో ఒక మహిళ మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఉదయం పొలం పనులకు వెళ్లిన బుచ్చమ్మ (35)కు విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతిచెందగా, ఆమెను కాపాడేందుకు వెళ్ళిన రవి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్ లో భారీ వర్షాలకు తెగిపడ్డ వైర్లను చూసుకోకుండా తాకడంతో ఈ ఉదయం ఓ దంపతులు మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే.