: అక్షయ తృతీయ సందడి మొదలు... ఆఫర్ల మీద ఆఫర్లు!
ఈ నెల 21న అక్షయ తృతీయ. ఆ రోజు బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందన్నది అనాదిగా వస్తున్న నమ్మకం. ఈ నమ్మకాన్ని సొమ్ము చేసుకుని అంతంతమాత్రంగా ఉన్న బంగారం అమ్మకాలను పెంచుకోవాలని ఆభరణాల తయారీదారులు, వ్యాపారులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు పర్వదినానికి 10 రోజుల ముందు నుంచే ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు మంచి ఊపు మీద ఉన్నాయి. 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ. 25 వేల నుంచి రూ. 26 వేల మధ్య ఉంది. భవిష్యత్ లో బంగారం ధరలు మరింతగా పెరగనున్నాయని, అందువల్ల ఆభరణాలు కొనుగోలు చేయాలని భావించే వారు ఇప్పుడు కొనిపెట్టుకుంటే మంచిదని విశ్లేషకులు సూచిస్తుండడంతో ఈ ఏటి అక్షయ తృతీయ అమ్మకాలు రికార్డు స్థాయులను దాటవచ్చని అంచనా. కాగా, అక్షయ తృతీయ కోసం ముందస్తు బుకింగ్ ప్రారంభించినట్టు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రకటించింది. ముందుగానే ఆభరణాలు బుక్ చేసుకుంటే వెండి ఉచితంగా ఇస్తామని, తరుగులో రాయితీలు ఇస్తామని ప్రకటించింది. మరో జ్యూయలరీ రిటైల్ చైన్ కల్యాణ్ జ్యూవెలర్స్ రూ. 5 వేల ధర నుంచి వజ్రాభరణాలు అందుబాటులో ఉన్నాయని, మహిళలకు ఉంగరాల ధర రూ. 7 వేల నుంచి మొదలవుతుందని తెలిపింది. ఆభరణాలు ముందుగానే బుక్ చేసుకొని అక్షయ తృతీయ పర్వదినం నాడు డెలివరీ తీసుకునే ఏర్పాట్లు చేసినట్టు చందన బ్రదర్స్ వివరించింది. పర్వదినం రోజున రద్దీని తట్టుకునే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్న దుకాణాదారులు, ముందుగానే బంగారు నగను ఎంచుకుని డబ్బు చెల్లించి 21న వచ్చి డెలివరీ తీసుకోవాలని సూచిస్తున్నారు. అక్షయ తృతీయ కస్టమర్ల కోసం ఎన్నో డిజైన్లను సిద్ధం చేశామని కొన్ని సంస్థలు, చెన్నై కేంద్రంగా హైదరాబాద్‌లో దుకాణాలు నిర్వహిస్తున్న సంస్థలు మార్కెట్ రేటు కన్నా గ్రాముకు 100 రూపాయల వరకూ తక్కువ ధరకు ఆభరణాలు విక్రయిస్తామని ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ఈ పర్వదినం రోజున ప్రజలను జ్యూయలరీ దుకాణాలవైపు నడిపించేందుకు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సైతం ప్రత్యేక ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించింది. ఏదిఏమైనా బంగారానికి డిమాండ్ ఎల్లప్పుడూ ఉండే భారత్‌లో ఆభరణాల తయారీ సంస్థలు అక్షయ తృతీయను ఎంతమేరకు ఉపయోగించుకుని లబ్ధి పొందుతాయన్నది మరో 10 రోజుల్లో తెలుస్తుంది.