: టమోటా రైతులపై ‘ఎన్ కౌంటర్’ ఎఫెక్ట్... తమిళనాడుకు నిలిచిన సరఫరా
చిత్తూరు జిల్లా పరిధిలోని శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ ప్రభావం చివరకు టమోటా రైతులపైనా పడింది. ఎన్ కౌంటర్ లో 20 మంది తమిళ కూలీలు చనిపోయిన నేపథ్యంలో తమిళనాడులో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో గడచిన ఐదు రోజులుగా చెన్నైకి ఏపీ నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. నిన్నటిదాకా ఈ ప్రభావం ప్రజా రవాణాపైనే పడగా, తాజాగా ఆ ప్రభావం రైతులపైనా పడింది. ఏపీలో పండిస్తున్న టమోటా పెద్ద ఎత్తున తమిళనాడుకు తరలుతున్న విషయం తెలిసిందే. రవాణా నిలిచిపోయిన నేపథ్యంలో ఎక్కడి టమోటా అక్కడే నిలిచిపోయింది. ఎక్కువ కాలం నిల్వ ఉండని టమోటా క్రమంగా పాడవుతోంది. ఈ నేపథ్యంలో టమోటా రైతులు ఆందోళనలో పడిపోయారు. ఇప్పటికే పెద్ద ఎత్తున టమోటా నాశనమైందని, ఇప్పటికైనా తమిళనాడుకు టమోటా సరఫరాను పునరుద్ధరించాలని రైతులు వేడుకుంటున్నారు.