: నటి శ్రుతిహాసన్ ను తిట్టింది నేను కాదు, బాబోయ్!: ఏపీ మంత్రి కామినేని ఆవేదన
సినీ నటి శ్రుతిహాసన్ ను తాను తిట్టానంటూ వచ్చిన వార్తలను ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. ఆమెను తాను ఏడిపించినట్టు వచ్చిన వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె పయనించిన విమానంలో తాను లేనని కామినేని వివరణ ఇచ్చారు. ఉహాజనిత వార్తలకు వివరణ కూడా తీసుకోలేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ లో ప్రచారంలో వున్న కథనం ప్రకారం, శ్రుతి తిరుపతి వెళుతున్న క్రమంలో ఆమె ఎక్కిన విమానంలోనే ఓ ఏపీ మంత్రి కూడా ఎక్కారు. అయితే, విమానంలో ఉన్న విషయాన్ని మరిచి ఫోన్ లో మంత్రి పెద్దగా మాట్లాడుతున్నారు. దాంతో చాలా ఇబ్బందిపడిన శ్రుతి చాలాసేపు ఓపిక పట్టిందట. చివరికి మొబైల్ ను స్విచ్చాఫ్ చేయాలని సదరు మంత్రిని కోరింది. దాంతో ఆగ్రహం చెందిన మంత్రిగారు ఆమెపై తిట్ల దండకం మొదలెట్టారు. ఆయనతో గొడవ పడలేక అమ్మడు ఏడ్చేసిందట. ఇంతలో ఎయిర్ హోస్టస్ వచ్చి ఆమెను ఓదార్చింది. అంతేకాదు, మంత్రితో మాట్లాడి గొడవను అంతటితో ఆగేలా చేశారట. నిన్నంతా (శుక్రవారం) సోషల్ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేసింది. ఇంతకీ శ్రుతిని ఇబ్బందిపెట్టిన ఆ మంత్రి ఎవరా? అని అంతా తలగోక్కుంటున్నారు. కానీ మంత్రి పేరు మాత్రం బయటికి రాలేదు.