: ఒక్క క్యాచ్ ను ఇద్దరు పట్టేశారు... ఆ క్యాచే ‘రాయల్స్’కు వరమైంది!
నిజమే, క్యాచ్ ఒకటే. కానీ పట్టుకుంది మాత్రం ఇద్దరు. అదెలా సాధ్యం? నిన్నటి పంజాబ్, రాజస్థాన్ మ్యాచ్ చూసి ఉంటే, సాధ్యమే సుమా అనుకోక తప్పదు. ఈ అరుదైన క్యాచ్ ‘రాయల్స్’ను విజయం ముంగిట నిలపగా, భారీ హిట్లర్లున్న పంజాబ్ కు ఘోర పరాజయాన్ని మిగిల్చింది. అసలు విషయంలోకి వస్తే... నిన్నటి పంజాబ్, రాజస్థాన్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులు చేసింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ను సెహ్వాగ్ నిరాశపరిచాడు. ఆ తర్వాత కాస్త బాగానే ఆడుతున్న పంజాబ్ లక్ష్యానికి చేరువవుతోంది. బెయిలీ జట్టు స్కోరును పరుగెత్తిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు ఓ భారీ షాట్ ఆడాడు. అతడు కొట్టిన బంతి దాదాపు బౌండరీ లైన్ దాటేసింది. అందరూ సిక్సేననుకున్నారు. అయితే రాయల్స్ బౌలర్ టిమ్ సౌథీ తనను తాను నియంత్రించుకుంటూ బౌండరీ లైన్ వద్ద బాల్ ను చేజిక్కించుకున్నాడు. అయితే అప్పటికే అతడు బౌండరీ లైన్ దాటాడు. అయితే క్షణాల్లో బంతిని బౌండరీ లైన్ లోపలికి విసిరేశాడు. ఆ బంతిని రాయల్స్ ఫీల్డర్ కరణ్ అద్భుతమైన డైవ్ చేసి మరీ ఒడిసి పట్టుకున్నాడు. దీంతో ఇద్దరి చేతులు మారినా, బెయిలీ పెవిలియన్ చేరకతప్పలేదు. పంజాబ్ ఓటమి మూటగట్టుకోక తప్పలేదు.