: రండి, షూటింగ్స్ చేసుకోండి...సూపర్ సీన్స్ తీసుకోండి!: దర్శక నిర్మాతలకు బాబు పిలుపు


బాలకృష్ణ 'లయన్' రూపంలో సునామీ సృష్టిస్తారని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. గతంలో తాను సీఎంగా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాల ఆడియోను ఆవిష్కరించానని, అవి ఎలా ఆడాయో అందరికీ తెలుసని, లయన్ కూడా అదే కోవలో చేరుతుందని అన్నారు. సింహం పేరు ఎన్టీఆర్, బాలకృష్ణకి మాత్రమే కలిసి వచ్చిందని ఆయన చెప్పారు. లయన్ డైలాగులన్నీ రాష్ట్రంలో మారుమ్రోగుతున్నాయని ఆయన తెలిపారు. రేపట్నుంచి ఈ డైలాగులే ప్రాక్టీస్ చేస్తారని భావిస్తున్నానని అన్నారు. బాలయ్యకు ఎవరూ పోటీలేరని, బాలయ్యకు బాలయ్యే పోటీ అని ఆయన అన్నారు. ఎన్టీఆర్ కు అప్పట్లో పోటీ లేదని, ఆయనలాగే ఇలాంటి క్యారెక్టర్ చేయగల సామర్థ్యం బాలయ్యకు తప్ప మరెవరికీ లేదని ఆయన పేర్కొన్నారు. కొత్త దర్శకుడి తొలి సినిమాను సూపర్ హిట్ చేసే బాధ్యత బాలయ్య తీసుకున్నారని, సత్యదేవాకు మంచి భవిష్యత్ ఉందని ఆయన పేర్కొన్నారు. సినిమాకు బాగా డబ్బులు వస్తాయని, టీడీపీకి డొనేషన్ ఇచ్చేంత లాభాలు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. మాస్ హీరో అంటే బాలయ్యేనని, లయన్ సినిమాలో బాలయ్య అందంగా, యంగ్ గా కనిపిస్తున్నారని ఆయన అన్నారు. ఈ సినిమా ప్రారంభమైన దగ్గర్నుంచి బాలయ్య లయన్ మాదిరిగా మాట్లాడుతున్నాడని బాబు తెలిపారు. ట్రైలర్ లోనే ఇలా ఉంటే, సినిమా ఏ రకంగా ఉంటుందో ఊహించుకోవచ్చని ఆయన అభిమానులను ఊరించారు. మణిశర్మ బాణీలు అందర్నీ ఆకట్టుకుంటాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 'షూటింగ్స్ కోసం విదేశాలకు వెళ్లొద్దు, విశాఖకు రండి, సూపర్ సీన్స్ తీసుకోండని' ఆయన పిలుపునిచ్చారు. భారతదేశంలో అవుట్ డోర్ సినిమా షూటింగ్ అంటే అంతా ఆంధ్రప్రదేశ్ కు వచ్చేలా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. తెలుగు వారిని కలిపి ఉంచే శక్తి ఒక్క టీడీపీకి మాత్రమే ఉందని ఆయన హామీ ఇచ్చారు. తెలుగు సినిమాలకు అద్భుతమైన భవిష్యత్ ఉంది కనుక, మన రాష్ట్రంలోనే సినిమాలు తీయాలని ఆయన సూచించారు. ఎన్ని మంచి సినిమాలు తీస్తే అంత ఆసుపత్రికి వెళ్లడం తగ్గిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వినోదం వల్ల ఆరోగ్యం, ఒత్తిడి తగ్గుతుందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News