: సరూర్ నగర్ కాల్పుల నిందితులు దొరికారు
హైదరాబాదులోని సరూర్ నగర్ లో గత వారం కాల్పులు జరిపిన నిందితులను ఎల్బీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని డీసీపీ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సరూర్ నగర్ లో నాగరాజుపై కాల్పులు జరిపి బైక్ పై పరారైన దుండగులను అరెస్టు చేశామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు...ఏలూరులో జ్యోతిష్యుడు నాగరాజు మంచి పేరు తెచ్చుకోవడం ఇష్టం లేని భూతం శ్రీనివాస్, చిన్న శ్రీనివాస్ లు, ఢిల్లీకి చెందిన చాంద్, సోహల్ కు సుపారీ ఇచ్చి అతనిని హత్య చేయమని పురమాయించారు. దీనిని ఒప్పుకున్న చాంద్, సోహల్ లు బాబు, గణేష్ లకు సుపారీ ఇచ్చి, నాగరాజును హత్య చేయమని పురమాయించారు. దీంతో బాబు, గణేష్ లు నాగరాజుపై కాల్పులకు పాల్పడ్డారు. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.