: తొలుత ఘర్షణకు దిగింది వికారుద్దీనే... తొలి తూటా తగిలింది కూడా అతడికే!
ఉగ్రవాది వికారుద్దీన్, అతడి అనుచరులపై జరిగిన ఎన్ కౌంటర్ వరుస క్రమం దాదాపుగా వెల్లడైంది. పోలీసులంటే అసహ్యించుకునే వికారుద్దీన్, ఎస్కార్టు సిబ్బందిపై దూషణల పర్వం కొనసాగించిన వైనం గతంలోనే చూశాం. కేవలం బిర్యానీ, మినరల్ వాటర్ కోసం అతడు మూడేళ్ల క్రితం ఎస్కార్ట్ సిబ్బందిపై దాడికి దిగాడు. తాజాగా రెండు రోజుల క్రితం కూడా అతడు తన వాగ్బాణాల నైజాన్ని కొనసాగించాడు. ఆలేరు-జనగాం మధ్యకొచ్చేసరికి తప్పించుకునేందుకు యత్నించే క్రమంలో వికారుద్దీన్ ఎస్కార్ట్ సిబ్బందిపై దాడికి దిగాడు. ఆ తర్వాత అతడి అనుచరులు కూడా పోలీసులపై దాడి చేశారు. దాడి నుంచి తేరుకున్న పోలీసులు వాహనం కదులుతుండగానే కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో తొలి తూటా వికారుద్దీన్ కే తగిలిందట. నిన్న వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రిలో ఎన్ కౌంటర్ మృతదేహాలకు వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహించారు. ఒక్కో ఉగ్రవాది శరీరంలోకి 5 నుంచి 8 బుల్లెట్లు చొచ్చుకెళ్లాయని వైద్యులు గుర్తించారు. పోలీసులపై దాడి ప్రారంభించిన వికారుద్దీన్ తల, గొంతులోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి.