: తెనాలి రైల్వే స్టేషన్ లో టెన్షన్... తిరుమల ఎక్స్ ప్రెస్ లో సోదాలు
గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్ లో గత రాత్రి టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. గుంటూరు మీదుగా తిరుపతి వెళుతున్న తిరుమల ఎక్స్ ప్రెస్ లో ఉగ్రవాదులున్నారని పోలీసులకు సమాచారం అందింది. అంతే, ఒక్కసారిగా 200 మందికిపైగా పోలీసులు తెనాలి చేరుకున్నారు. స్టేషన్ కు తిరుమల ఎక్స్ ప్రెస్ రాగానే దానిని నిలిపేశారు. ఎక్స్ ప్రెస్ లోని అన్ని బోగీల్లో పోలీసులు ముమ్మరంగా సోదాలు చేశారు. అణువణువూ తనిఖీ చేశారు. అయితే ఉగ్రవాదులెవ్వరూ రైల్లో లేరని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన కోల్ కతాకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన పోలీసులు రైల్లో తనిఖీలు నిర్వహించడంతో అక్కడ టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.