: చెన్నైలో ఆంధ్రా సంస్థల వద్ద ఉద్రిక్తత... బలగాల మోహరింపు
ఈ ఉదయం శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్ర చందనం స్మగ్లర్ల ఎన్ కౌంటర్ పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ప్రజలు, రాజకీయ పార్టీలకు ఆగ్రహాన్ని తెప్పించింది. తమిళ ప్రజలు ఆంధ్రా ఆస్తులపై, సంస్థలపై దాడులు జరపవచ్చన్న అనుమానాలతో పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో చెన్నైలో ఆంధ్రా ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. అధికారులు 'ఆంధ్రా కేఫ్' వద్దా, టీ-నగర్, పాండీ బజార్ తదితర ఏరియాల్లోని పలు సంస్థల వద్దా భద్రతను పెంచారు. కాగా, ఈ ఎన్ కౌంటర్ ను ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. మరో తమిళ నేత వైగో ఇంకో అడుగు ముందుకేసి తమిళనాడులోని ఆంధ్రాబ్యాంకులపై దాడులు చేస్తామని హెచ్చరించారు. మృతులకు ఏపీ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, కాల్పులు జరిపిన పోలీసులపై హత్య కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. తమిళనాడు కాంగ్రెస్ పార్టీ సైతం ఎన్ కౌంటర్ భూటకమని, అమాయకులను చంపారని విమర్శించింది.