: 'నాకు మాట్లాడడం రాదు' అంటూనే పెద్దగా మాట్లాడిన త్రివిక్రమ్!
తనకు పెద్దగా మాట్లాడడం రాదని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో 'సన్ ఆఫ్ సత్యమూర్తి' ఆడియో సక్సెస్ వేడుకలో ఆయన మాట్లాడుతూ, "అంతా అమ్మ గురించి మాట్లాడుతాం. కానీ మనం నాన్న వేలి పట్టుకునే నడుస్తాం. ఐదేళ్ల ప్రతి పిల్లాడు తన తండ్రే సూపర్ హీరో అనుకుంటాడు. పదేళ్ల తరువాత నాన్న కంటే ఇంకా పెద్దోళ్లు ఉన్నారనుకుంటాడు. 20 ఏళ్లప్పుడు మా నాన్నేంట్రా బాబు, పెద్ద నసగాడిలా ఉన్నాడు అనుకుంటాడు. 25 ఏళ్లప్పుడు నాన్న భలే మేనేజ్ చేశాడని అనుకుంటారు. అదే 35 లేదా 40 ఏళ్లు వచ్చేసరికి నాన్న చాలా గొప్పవాడని భావిస్తాం" అన్నారు. అప్పటికే నాన్న మనల్ని వీడిపోతారని, అలా కాకుండా, నాన్న ఉండగానే ఓ కృతజ్ఞత ఇద్దామని ఆయన చెప్పారు. నాన్నను చూసే చాలా నేర్చుకుంటామని త్రివిక్రమ్ చెప్పారు. ఆయన వెళ్లిపోయాక కనపడని నీడలాగ ప్రతిక్షణం ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సినిమా అనుకున్నప్పుడు, ఎన్నాళ్లు పడితే అన్నాళ్లు పని చేయండి, పూర్తి రూపం వచ్చినాకే, పని చేద్దామని బన్నీ అన్నారని ఆయన చెప్పారు. బన్నీ సహకారం లేకుంటే, ఈ సినిమా, అనుకున్న సమయానికి, అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేయలేమని ఆయన చెప్పారు. కథ విని సలహాలిచ్చారు. అడిగితే షూటింగ్ చేసుకునేందుకు ఇల్లు కూడా ఇచ్చారని ఆయన తెలిపారు. మంచి కథ చెప్పు అని నిర్మాత చెప్పారని, దానికి అనుగుణంగా ఏది అడిగినా, అడగకున్నా అన్నీ సమకూర్చిన చినబాబుకు ధన్యవాదాలని అన్నారు. తనతోపాటు పరుగెత్తిన ప్రసాద్ మూరెళ్లకు ధన్యవాదాలని త్రివిక్రమ్ చెప్పారు.