: పదేళ్ల దాకా ఎంట్రీ ట్యాక్స్ రద్దయ్యేలా చూడండి... గవర్నర్ కు ఏపీ కాంగ్రెస్ నేతల వినతి
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఎంట్రీ ట్యాక్స్ రద్దయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను ఏపీ కాంగ్రెస్ నేతలు కోరారు. ఈ మేరకు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డితో పాటు పార్టీ కీలక నేతలు బొత్స సత్యనారాయణ, చిరంజీవి, కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు తదితరులు కొద్దిసేపటి క్రితం గవర్నర్ ను కలిశారు. గవర్నర్ తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఎదుట మీడియాతో మాట్లాడిన నేతలు, ఏపీలో నెలకొన్న కరవు పరిస్థితులపై టీడీపీ సర్కారు రాజకీయం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఏర్పడ్డ కరవు పరిస్థితుల నేపథ్యంలో ఎంట్రీ ట్యాక్ప్ ను పదేళ్ల పాటు అమలు చేయకుండా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరామన్నారు. ఈ విషయంలో కొత్తగా తామేమీ కోరడం లేదని, రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను తూచా తప్పకుండా అమలు చేయాలని మాత్రమే కోరామని వారు తెలిపారు.