: మినప బస్తాల చోరీ వివాదం... మచిలీపట్నం రూరల్ పీఎస్ పై రెండు గ్రామాల దాడి!


కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని రూరల్ పోలీస్ స్టేషన్ వాస్తు బాగా లేన్నట్టుంది. వారం రోజుల వ్యవధిలో ఈ పోలీస్ స్టేషన్ పై రెండు సార్లు దాడులు జరిగాయి. మొన్నటికి మొన్న విద్యార్థుల అక్రమ నిర్బంధంపై పోలీస్ స్టేషన్ పై ఓ గ్రామం మూకుమ్మడి దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అదే పోలీస్ స్టేషన్ పై ఈసారి రెండు గ్రామాలు మూకుమ్మడి దాడి చేశాయి. వివరాల్లోకెళితే... మినప బస్తాల చోరీకి సంబంధించి మచిలీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళాపురం, భోగిరెడ్డిపల్లి గ్రామాల మధ్య వివాదం నెలకొంది. మినప బస్తాల ఫిర్యాదు అందిన మచిలీపట్నం రూరల్ పోలీసులు కొందరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆధారాలు లేకుండా తమ గ్రామానికి చెందిన వారిని ఎలా అరెస్ట్ చేస్తారంటూ మంగళాపురం వాసులు పోలీసులను నిలదీశారు. దీంతో పోలీసులు నిందితులను విడిచిపెట్టారు. అయితే ఓ గ్రామం మాట విని నిందితులను ఎలా విడిచిపెడతారంటూ భోగిరెడ్డిపల్లి వాసులూ పోలీసులను ప్రశ్నించారు. ఈ క్రమంలో రెండు గ్రామాల ప్రజలు పోలీస్ స్టేషన్ మీద దాడికి దిగారు. చోరీపై సమగ్ర విచారణ చేసి న్యాయం చేస్తామన్న ఉన్నతాధికారుల హామీతో వారు శాంతించారు.

  • Loading...

More Telugu News