: ‘షూటర్స్’ను కెమెరాలో బంధించిన ‘సాహస’ విలేకరికి ప్రశంసల వెల్లువ... నగదు పురస్కారాలు!
ముగ్గురు పోలీసులను పొట్టనబెట్టుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్తు దేశాన్ని భయాందోళనల్లోకి నెట్టిన ‘సూర్యాపేట షూటర్స్’ తాజాగా సిమీ ఉగ్రవాదులని తేలిపోయింది. ఈ మేరకు తెలంగాణ డీజీపీ కార్యాలయం ప్రకటించింది. పోలీసుల కాల్పుల్లో హతమయ్యేదాకా వారెలా ఉంటారో తెలియదు. అయితే బతికుండగా వారి ముఖాలను తన కెమెరాలో బంధించిన తెలుగు దినపత్రిక ‘సాక్షి’ అర్వపల్లి విలేకరి శ్రీరంగం వెంకన్నకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అర్వపల్లి మండల కేంద్రంలో బైక్ పై ఓ ఉగ్రవాది కూర్చుని ఉండగా... ఓ చేత కార్బన్, మరో చేత పిస్టల్ పట్టుకుని ఘీంకరిస్తూ ఆ బైక్ ఎక్కుతున్న మరో ఉగ్రవాదిని వెంకన్న ఫొటో తీసిన సంగతి తెలిసిందే. సదరు ఫొటో ప్రస్తుతం మీడియాలోనే కాక సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తోంది. అదే సమయంలో వెంకన్న ధైర్యసాహసాలను మెచ్చుకుంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాణాలకు తెగించి ఉగ్రవాదుల ఫొటోలను తీసిన వెంకన్నకు తెలంగాణ ప్రెస్ అకాడెమీ రూ.15 వేల నగదు పురస్కారాన్ని ప్రకటించగా, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రూ.10 వేల నగదు పురస్కారాన్ని ప్రకటించింది.