: కేంద్ర కేబినెట్ లోకి మరో తెలుగోడు... ఆరెస్సెస్ ప్రముఖుడు రామ్ మాధవ్ కు అవకాశం!
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)లో కీలక నేతగా ఎదిగిన తెలుగు తేజం రామ్ మాధవ్, ఇటీవలే భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి హోదాలో పార్టీ చీఫ్ అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ అంచనాలను మించి ఫలితాలు సాధిస్తూ దూసుకుపోతున్నారు. జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ నేతలు తొలిసారిగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంలో రామ్ మాధవ్ ది కీలక భూమిక. ఆ రాష్ట్ర ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావించిన రామ్ మాధవ్, రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశారు. ఫలితం సాధించారు. ఆశించిన మేర కంటే మెరుగ్గా రాణిస్తున్న రామ్ మాధవ్ ను కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటే ఎలా ఉంటుందన్న దిశగా ప్రధాని నరేంద్ర మోదీ యోచిస్తున్నారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పనిచేయని పలువురు మంత్రులకు ఉద్వాసన పలికేందుకు మోదీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా మిత్రపక్షాలకు చెందిన వారికి స్థానం కల్పించడంతో పాటు మరికొంత మంది సహాయ మంత్రులకు కేబినెట్ హోదా కట్టబెట్టనున్న మోదీ, రామ్ మాధవ్ కు కీలక శాఖ బాధ్యతలు అప్పజెప్పాలని దాదాపుగా నిర్ణయించుకున్నారట. అదే జరిగితే, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్థాయిలో మరో తెలుగు తేజం ఢిల్లీలో చక్రం తిప్పడం ఖాయమే.