: ఈ ప్రశ్నలకు బదులేది?... కేజ్రీవాల్ కు ప్రశాంత్ భూషణ్ బహిరంగ లేఖ


ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉంటూ, ఇటీవల పదవి నుంచి తొలగింపుకు గురైన ప్రశాంత్ భూషణ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు పలు ప్రశ్నలు సంధిస్తూ బహిరంగ లేఖ రాశారు. లేఖ ముఖ్యాంశాలివి. డియర్ అరవింద్, మార్చి 28న జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ పరిస్థితి, భవిష్యత్ మార్గ నిర్దేశం చేయాల్సిన మీరు యోగేంద్రతో పాటు నాపై, నా తండ్రిపై ఆరోపణల దాడి చేశారు. మీ వ్యాఖ్యలు పలువురు ఎంఎల్ఏలలో భయాందోళనలు కలిగించాయి. మీరు చేసిన ఆరోపణలపై కనీసం సమాధానం చెప్పే అవకాశం కూడా మాకు ఇవ్వలేదు. ఎంఎల్ఏల నినాదాల మధ్య మనీష్ మా తొలగింపుపై నిర్ణయాన్ని వెలువరించారు. ఇది భావ్యమా? ఆ పై ఎటువంటి చర్చ లేకుండా మా తొలగింపుపై ఓటింగ్ పెట్టి చేతులు ఎత్తమన్నారు. మమ్మల్ని బలవంతంగా బయటకు పంపడం తప్పుడు చర్య కాదా? ఈ సభకు సభ్యులు కానివారిని కూడా ఆహ్వానించారు. బౌన్సర్లను కూడా మోహరించారు. చాలా కారణాల వల్ల సమావేశం సజావుగా సాగలేదు. స్వతంత్రంగా వీడియో తీయించారు. ఆ మరుసటి రోజు మరింత ఘోరంగా వ్యవహరిస్తూ, పార్టీ అంతర్గత లోక్ పాల్ సభ్యుడిని పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా బాధ్యతల నుంచి తొలగించారు. మరో జాతీయ కార్యవర్గ సభ్యుడిని గెంటివేశారు. ఇందుకు కారణాలు మీరు చెప్పాలి. ఆ తరువాత మీ ప్రసంగాన్ని జాగ్రత్తగా ఎడిట్ చేసి ప్రపంచానికి చూపారు. మీరు మాట్లాడిన మొత్తం ప్రసంగాన్ని విడుదల చేయలేక పోయారు. మీ ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు నేను కొంత గతాన్ని, మన మధ్య విబేధాలకు కారణమైన అంశాలను ఆలోచించుకోవాల్సి వచ్చింది. మీకు గుర్తుందా... లోక్ సభ ఎన్నికల సమయంలో మీ ప్రవర్తనలో తేడా వచ్చి మనమధ్య అంతరం పెరిగింది. పార్టీలో కేవలం మీ నిర్ణయాలే అమలు కావాలని మీరు పట్టుబట్టారు. ఈ నిర్ణయాలు పార్టీకి, ప్రజలకూ కీడు కలిగించాయి. మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి అనైతిక కార్యకలాపాలకు పాల్పడటమే కాక, నేర పూరితంగానూ వ్యవహరించారు. లోక్ సభ ఎన్నికల అనంతరం పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని భావించిన మీరు ఢిల్లీ రాష్ట్రంలో అధికారం కోసం కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపారు. మీ చర్యలు సంతృప్తికరంగా లేవని, పృథ్వి రెడ్డి, మయాంకా గాంధీ, అంజలి తదితరులు నా వద్ద ప్రస్తావించారు కూడా. ఈ విషయమై పార్టీలో చర్చించి అందరి ఆమోదముద్రతోనే ముందుకు సాగాలని నేను కూడా మీకు చెప్పాను. వచ్చే ఐదేళ్లు ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపి అవినీతి రహిత స్వచ్ఛ పరిపాలనను అందించాలని నేను కోరుకుంటున్నాను. ఈ విషయంలో ఆమ్ ఆద్మీ కల కలగానే మిగిలిపోకూడదని ఆశిస్తూ... గుడ్ బై అండ్ గుడ్ లక్.

  • Loading...

More Telugu News