: మచిలీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పై మంగళాపురం గ్రామస్థుల దాడి
కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పై మంగళాపురం గ్రామస్థులు మూకుమ్మడిగా దాడి చేశారు. అమాయక విద్యార్థులను అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ గ్రామస్థులు పోలీస్ స్టేషన్ పై విధ్వంసానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులను అక్రమంగా నిర్బంధించిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గ్రామస్థులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని గ్రామస్థులతో చర్చలు జరిపారు. విద్యార్థుల నిర్బంధంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న పోలీసు బాసుల హామీతో గ్రామస్థులు శాంతించారు.