: దిగ్విజయ్ సింగ్ పై కేటీఆర్ సెటైర్లు
కమిషన్లు, కుంభకోణాలు కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అని టీఎస్ మంత్రి కె.తారకరామారావు విమర్శించారు. కాంగ్రెస్ పాలన మొత్తం అవినీతిమయమే అని ఆరోపించారు. తెలంగాణలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పై కాంగ్రెస్ జాతీయ నేత దిగ్విజయ్ సింగ్ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో, కేటీఆర్ ఈ విధంగా స్పందించారు. పైపుల పరిశ్రమ కోసం వాటర్ గ్రిడ్ చేపట్టలేదని... ప్రజల దాహార్తిని తీర్చేందుకు చేపట్టామని చెప్పారు. 60 ఏళ్ల దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి గొప్ప కార్యక్రమం చేపట్టలేదని అన్నారు. పైపులు లేకుండా నీళ్లివ్వడం, తీగలు లేకుండా కరెంట్ ఇవ్వడం, స్కూళ్లు లేకుండా చదువు చెప్పడం సాధ్యమేనా? అని కేటీఆర్ ప్రశ్నించారు. మహానుభావుడు దిగ్విజయ్ సింగ్ కొత్త టెక్నాలజీ ఏదైనా కనుగొని ఉంటే, దాన్ని తమతో పంచుకుంటే స్వీకరిస్తామని చెప్పారు.