: ఈసారి బ్రిటన్ గుట్టువిప్పిన ఎడ్వర్డ్ స్నోడెన్
అగ్రరాజ్యం అమెరికా రహస్యాలను విప్పిచెప్పిన 'ప్రజావేగు' ఎడ్వర్డ్ స్నోడెన్ మరో బాంబు పేల్చాడు. ఈసారి బ్రిటన్ ను లక్ష్యంగా చేసుకున్నాడు. ఫాక్ లాండ్ దీవుల వ్యవహారంలో బ్రిటన్... అర్జెంటీనా సర్కారుపై గూఢచర్యానికి పాల్పడిందని తెలిపాడు. 2006 నుంచి 2011 వరకు బ్రిటీష్ గూఢచారులు ఎంతో చురుగ్గా కార్యకలాపాలు సాగించారని తెలిపాడు. అర్జెంటీనా ఈ దీవుల కోసం మరో ప్రయత్నం చేస్తుందేమోనని బ్రిటన్ ఆందోళన చెందిందని వివరించాడు. దీనిపై అర్జెంటీనా మీడియాలో కథనాలు వచ్చాయి. ఫాక్ లాండ్ దీవుల కోసం 1982లో బ్రిటన్, అర్జెంటీనా తీవ్ర పోరు సల్పాయి. అప్పట్లో అర్జెంటీనా సేనలు ఈ దీవులను ఆక్రమించాయి. దీంతో యుద్ధం జరగ్గా, కొంత కాలం తర్వాత మళ్లీ బ్రిటీష్ పాలన పునరుద్ధరించారు. కాగా, అమెరికా భద్రత ఏజెన్సీలో పనిచేసిన స్నోడెన్... రహస్యాలు వెల్లడి చేయడంతో ప్రపంచదేశాలు నివ్వెరపోయాయి. దీంతో, అమెరికా అతని కోసం వేట ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రష్యా చేరిన స్నోడెన్ అక్కడ ఆశ్రయం పొందాడు.