: యూరో లాటరీ పదో జాక్ పాట్... రూ.490 కోట్ల లాటరీ గెలుచుకున్న బ్రిటన్ వ్యక్తి!
యూరో లాటరీ అంటే అదృష్ట లక్ష్మి లాంటిదే. లాంటిదే కాదు, ముమ్మాటికీ అదృష్ట లక్ష్మే. నిన్నటికి నిన్న రెండేళ్ల వ్యవధిలో ఓ డ్రైవర్ ను రూ.20 కోట్లకు అధిపతిని చేసిన యూరో లాటరీ, తాజాగా మంగళవారం బ్రిటన్ కు చెందిన ఓ కుటుంబానికి ఏకంగా రూ.490 కోట్ల భారీ జాక్ పాట్ ను అందించింది. బ్రిటన్ లో పౌల్ట్రీ ఇండస్ట్రీకి కన్సల్టెంట్ గా పనిచేస్తున్న రిచర్డ్ మ్యాక్స్ వెల్ కొనుగోలు చేసిన లాటరీ టికెట్ కు ఈ భారీ మొత్తం దక్కింది. ఇంత భారీ మొత్తంలో జాక్ పాట్ దక్కిన పదో వ్యక్తిగా ఇతడు రికార్డులకెక్కాడు. విచిత్రమేంటంటే, తాను కొనుగోలు చేసిన టికెట్ కు జాక్ పాట్ తగిలితే, తొలుత మ్యాక్స్ వెల్ తో పాటు అతడి భార్య, ఇద్దరు కూతుర్లు కూడా నమ్మలేదట. యూరో లాటరీ సంస్థ తమను ఏప్రిల్ ఫూల్స్ ను చేస్తోందేమోనని అనుకున్నారట. అయితే ఒకటికి రెండు సార్లు వెబ్ సైట్ లో తరచి చూసుకున్న మీదట జాక్ పాట్ తమ ఇంటికి వచ్చేసిందని నిర్ధారించుకున్నారు. అయితే ఒకేసారి ఇంత భారీ మొత్తం అందిరావడంతో ఏం చేయాలో మ్యాక్స్ వెల్ కుటుంబానికి పాలుపోలేదట. తొలుత న్యూజిలాండ్ టూర్ కు వెళ్లి వచ్చిన తర్వాత తీరిగ్గా ఆలోచిద్దామని మ్యాక్స్ వెల్ నిర్ణయించుకున్నాడట.