: నన్ను ఆడిపోసుకోవడం కాదు... నిజాలు వెలికి తీయండి: రూబీ చౌదరి
నకిలీ ధ్రువపత్రాలతో ముస్సోరీలోని ప్రతిష్ఠాత్మక లాల్ బహుదూర్ శాస్త్రి అడ్మినిస్ట్రేటివ్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ కు చెందిన రూబీ చౌదరిని డెహ్రాడూన్ లోని ఓ హోటల్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూపీఎస్సీ పరీక్షలో పాసయ్యానంటూ రూబీ చౌదరి పేరిట గత సెప్టెంబర్ 20న ఆమె అకాడమీలో చేరారు. ఆరు నెలలపాటు శిక్షణ పొందిన ఆమె మార్చి 27 నుంచి కనపడకుండా పోయారు. దీంతో, ఆమెపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులకు ఆమె డెహ్రాడూన్ లో పట్టుబడ్డారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా, ప్రసార సాధనాలు, దర్యాప్తు సంస్థలు తనను ఆడిపోసుకోవడం కాకుండా, వాస్తవంగా తప్పు చేసింది ఎవరు? అక్కడ ఎలా చేరగలిగాను? అంత కాలం అక్కడ ఎలా ఉండగలిగాను? వీటన్నింటికీ కారణమైన వారు ఎవరు? అనే అంశాలను వెలికి తీయాలని సవాలు విసిరారు. నకిలీ గుర్తింపు కార్డును తనకు ఇచ్చింది, డిప్యూటీ డైరెక్టర్ సౌరభ్ జైన్ అని ఆమె తెలిపారు. జరిగిన దానికి ఎవరినీ నిందించడం లేదని, అయితే, వాస్తవాలు నిజాయతీగా బయటపెట్టాలని ఆమె కోరారు.