: దేశంలోనే ఇది నెంబర్ వన్ పాలసీ: చంద్రబాబు
ఏపీ ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివరించారు. ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ దేశంలోనే నెంబర్ వన్ పాలసీ అని పేర్కొన్నారు. పారిశ్రామిక అనుమతుల కోసం సింగిల్ డెస్కు విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. 50 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే పారిశ్రామిక వేత్తలకు 25 శాతం రాయితీ ఇస్తామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామిక వేత్తలకు వందశాతం స్టాంపు డ్యూటీ ఉంటుందని వివరించారు. పారిశ్రామికవేత్తలకు గరిష్ఠంగా 9 శాతం వడ్డీ రాయితీ ఇస్తామని స్పష్టం చేశారు. పరిశ్రమలకు 24 గంటలు విద్యుత్ సరఫరా ఉంటుందన్నారు. భూమి, నీరు, విద్యుత్ అన్నీ సమకూరుస్తామని తెలిపారు. నూతన పారిశ్రామిక విధానం 2015 నుంచి 2020 వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్లో నమోదవుతాయని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో పారిశ్రామిక అభివృద్ధికి పదేళ్లలో రూ. 1200 కోట్లు ఖర్చు చేస్తే, ఈ ఒక్క ఏడాదే తాము రూ. 2056 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. భోగాపురం నుంచి కాకినాడ వరకు 3 ఎయిర్ పోర్టులు, 2 పోర్టులను అభివృద్ధి చేస్తామని, మచిలీపట్నాన్ని లాజిస్టిక్ హబ్ గా రూపొందిస్తామని పేర్కొన్నారు.