: తెలంగాణ పన్ను ఫలితం... రెండు చెక్ పోస్టుల నుంచి సుమారు రూ.కోటి ఆదాయం!
తెలంగాణ ప్రభుత్వం విధించిన అంతర్ రాష్ట్ర పన్ను విధానం అమలు చేయడంతో తొలిరోజు రెండు చెక్ పోస్టుల నుంచి వసూలైన ఆదాయం దాదాపు కోటి రూపాయలని అధికారులు తెలిపారు. ఏటా 50 కోట్ల రూపాయలు వస్తాయని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేయగా, తొలిరోజే కోటి రూపాయల పన్ను ఆదాయం రావడంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ చెక్ పోస్టు వద్ద అర్ధరాత్రి నుంచి 40 లక్షల రూపాయలు పన్ను రూపేణా వసూలైనట్టు తెలిసింది. నల్గొండ జిల్లా కోదాడ చెక్ పోస్టు వద్ద 75 వాహనాల నుంచి 51 లక్షల రూపాయలు వసూలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాదు బయల్దేరిన 20 బస్సుల నుంచి పన్ను వసూలు చేసినట్టు అధికారులు తెలిపారు.