: శ్రీనీ వల్ల ఐసీసీ ప్రతిష్ఠ మంటగలుస్తోంది... రాజీనామా లేఖలో ముస్తఫా ఘాటు వ్యాఖ్యలు
ఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ముస్తఫా కమల్, చైర్మన్ శ్రీనివాసన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు ఐసీసీలో శ్రీనివాసన్ పాత్రేమిటో తెలపాలని ఆయన ఐసీసీని నిలదీశారు. కొద్దిసేపటి క్రితం ఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ విడుదల చేసిన లేఖలో ఆయన ఐసీసీ వ్యవహారతీరు, శ్రీనీ మితిమీరిన జోక్యంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. శ్రీనీ వల్ల ఐసీసీ ప్రతిష్ఠ మంటగలుస్తోందని ముస్తఫా వ్యాఖ్యానించారు. ఐసీసీ అంటే ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ గా మారిపోయిందని కూడా ఆయన ఆరోపించారు. వరల్డ్ కప్ లో టీమిండియా-బంగ్లాదేశ్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో అంపైర్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించి ముస్తఫా ఇటీవల కలకలం రేపారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో, గత నెల 29న జరిగిన ఫైనల్ మ్యాచ్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి ఆయన దూరంగా ఉండాల్సి వచ్చింది. ఓ వైపు మ్యాచ్ జరుగుతుండగానే విజేతకు ట్రోఫీ బహూకరణ విషయంలో శ్రీనీతో ముస్తఫా వాగ్వాదానికి దిగారు. చివరికి ముస్తఫాపై పైచేయి సాధించిన శ్రీనివాసన్ విజేతకు ట్రోఫీని అందజేశారు. ఈ క్రమంలోనే తనకు అవమానం జరిగిందని భావించిన ముస్తఫా తన పదవికి రాజీనామా చేశారు.