: నేడు కోర్టుకు ‘మా’ ఎన్నికల వీడియో!
ప్రత్యక్ష రాజకీయ ఎన్నికలను తలపించేలా జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించిన వీడియో నేడు హైకోర్టుకు అందనుంది. ఈ మేరకు మా ఎన్నికల అధికారులు సదరు వీడియోను నేడు కోర్టుకు సమర్పించనున్నారు. మా ఎన్నికల ఫలితాల వెల్లడిని నిలుపుదల చేసిన హైకోర్టు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వీడియోను అందజేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే నిర్దేశిత సమయంలోగా వీడియోను సమర్పించని కారణంగా నిన్నటి విచారణ సందర్భంగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాక ఎన్నికల ఫలితాల వెల్లడిపై విధించిన నిషేధాన్ని కొనసాగిస్తూ, విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది. కోర్టు ఆగ్రహం దరిమిలా ఎన్నికల సందర్భంగా తీసిన వీడియోను న్యాయమూర్తులకు అందజేసేందుకు మా కార్యవర్గం సిద్ధమైంది. ఈ వీడియోను పరిశీలించిన తర్వాతే, ఎన్నికల ఫలితాల వెల్లడిపై కోర్టు నిర్ణయం వెలువరించనుంది.