: తెలుగు రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర పన్నుపోటు... నిలిచిపోయిన ప్రైవేట్ బస్సులు


అంతరాష్ట్ర పన్ను వసూలును తెలంగాణ ప్రభుత్వం గత అర్ధరాత్రి నుంచే ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఒక్కో ప్రైవేట్ బస్సుపై మూడు నెలల వ్యవధిలో రూ.1.60 లక్షల మేర భారీ పన్ను భారం పడుతోంది. పన్ను వసూలును ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం ఏపీతో సరిహద్దుల వద్ద ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. పిడుగులా వచ్చి పడిన అంతరాష్ట్ర పన్నుతో ప్రైవేట్ వాహనాల యాజమాన్యాలు బెంబేలెత్తిపోతున్నాయి. ఏపీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు బస్సులను షెడ్ల నుంచి బయటకు తీయలేదు. దీంతో హైదరాబాదులో ప్రైవేట్ బస్సులతో కిటకిటలాడే పలు ప్రాంతాలు బోసిపోయాయి. ప్రైవేట్ బస్సులు నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ సర్వీసులను ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ అధికారులు తలమునకలయ్యారు. ఇదిలా ఉంటే, రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 6 గంటల వరకు కేవలం ఆరు గంటల వ్యవధిలోనే ఖమ్మం జిల్లా అశ్వారావుపేట వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్దే దాదాపుగా రూ. 50 లక్షల మేర పన్ను వసూలైనట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News