: బీజేపీపై నకిలీ ఫోన్ కాల్స్ తో కేజ్రీ పోరు... బాంబు పేల్చిన ఆప్ మాజీ ఎమ్మెల్యే
పార్టీ స్థాపించి గట్టిగా రెండేళ్లు కూడా కాలేదు, అప్పుడే అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లో ఆరితేరిపోయారు. తొలి యత్నంలోనే అధికారం దక్కిన ఆయన తర్వాత కూడా దాని కోసం అర్రులు చాచినట్లు వరుసగా వెల్లడవుతున్న వాస్తవాలు చెప్పకనే చెబుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో బీజేపీని నిలువరించేందుకు, ఆ పార్టీని ప్రజల్లోనే కాక ఎన్నికల సంఘం దృష్టిలోనూ దోషిగా నిలబెట్టేందుకు కేజ్రీ పక్కా ప్లానే వేశారట. ఇందులో భాగంగా ఆప్ అభ్యర్థులకు డబ్బు ఆశ చూపుతున్నట్లు బీజేపీ నేతల నుంచి ఫోన్లు వచ్చినట్లుగా నాటకాలాడాలని ఆయన తన పార్టీ నేతలకు గుట్టుచప్పుడు కాకుండా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో బీజేపీ అగ్ర నేతలు నితిన్ గడ్కరీ, అరుణ్ జైట్లీల నుంచి ఆఫర్లు వచ్చినట్లుగా నకిలీ ఫోన్ కాల్స్ చేసేందుకు ఆయన ఆప్ నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. నిన్న మీడియా ముందుకు వచ్చిన ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే రాజేశ్ గార్గ్ ఈ మేరకు బాంబు పేల్చారు. అంతేకాక ఈ తరహా ఫోన్ కాల్స్ తనకూ వచ్చాయని ఆయన చెప్పడం గమనార్హం. మరి గార్గ్ ప్రకటనపై కేజ్రీవాల్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.