: కేజ్రీవాల్ పక్కలో బల్లెం... కొత్త పార్టీ ఏర్పాటు దిశగా భూషణ్, యోగేంద్ర అడుగులు!
దేశ రాజకీయ చరిత్రలో రికార్డులను నమోదు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు పక్కలో బల్లెం తయారవుతోంది. పార్టీ జాతీయ కౌన్సిల్ నుంచి బహిష్కరణకు గురైన ఆప్ సీనియర్ నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లు కొత్త పార్టీ పెట్టే దిశగా సాగుతున్నారు. పలు కీలక అంశాలపై కేజ్రీవాల్ పై బహిరంగంగా విమర్శలు ఎక్కుపెట్టిన వీరిద్దరిపై ఇటీవలే పార్టీ చర్యలు తీసుకుంది. పార్టీ చర్యలను తీవ్రంగా పరిగణించిన వీరిద్దరూ పార్టీలో అసంతృప్తులను దరిచేర్చి కొత్త పార్టీని స్థాపించాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని వచ్చే నెల 14న తమ మద్దతుదారులతో కీలక భేటీ నిర్వహించేందుకు వీరు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆప్ లో లోక్ పాల్ స్థానం నుంచి బహిష్కరణకు గురైన రాందాస్ తో పాటు పార్టీని వీడిన సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్ తదితరులను కూడా వీరు తమ భేటీకి ఆహ్వానిస్తున్నారు. వీరి యత్నాలు ఫలించి కొత్త పార్టీ అవతరిస్తే, కేజ్రీవాల్ కు నిజంగా పక్కలో బల్లెం తయారైనట్టే.